అటుకులవడ
అటుకుల వడ | వడ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మినప వడలు, అలసంద వడలు .. ఈరోజు అటుకులతో సులభంగా వడలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అటుకుల వడలు తక్కువ సమయంలో చేసుకోగల రుచికరమైన వంటకం. సెలవుల్లో ఇంట్లో ఉండే పిల్లలకు ఈ ప్రత్యేక వంటకాన్ని సాయంత్రం స్నాక్ గా కూడా పెట్టవచ్చు. మనకు అందుబాటులో ఉన్న ఏదైనా పచ్చడితో అల్పాహారంగా లేదా టీ మరియు కాఫీతో సర్వ్ చేయండి!
కావలసిన పదార్థాలు:-
- అటుకులు : 2 కప్పులు
- పచ్చి మిర్చి : 3
- శనగ పిండి : రెండు టీ స్పూన్లు
- అల్లం తురుము : టీ స్పూన్
- జీలకర్ర : 1 టీస్పూన్
- ఉల్లిపాయ ముక్కలు : రెండు టీ స్పూన్లు
- నీరు : తగినన్ని
- కరివేపాకు : రెబ్బ
- కొత్తిమీర తరుగు : రెండు టీ స్పూన్లు
- కారం : పావు స్పూన్
- పసుపు : పావు స్పూన్
- ఉప్పు : తగినంత
- నూనె : వేయించడానికి తగినంత
తయారుచేయు విధానం:-
1
అటుకులను నీళ్ళలో నానబెట్టుకోవాలి. పది నిముషాల తరువాత నీళ్ళు తీసేసి,చేతితో మెత్తగా పిండిలా అయ్యేవరకు చిదుముకోవాలి.
2
ఒక గిన్నెలో మెత్తగా చేసుకున్న అటుకులు,శనగ పిండి,సన్నగా తరిగిన పచ్చి మిర్చి ,అల్లం తురుము, జీలకర్ర,ఉల్లిపాయ ముక్కలు,సన్నగా తరిగిన కరివేపాకు,కొత్తిమీర, పసుపు,కారం,రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
3
స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేడైన తరువాత మీడియం మంట పై అటుకుల మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసుకుని వేయించుకోవాలి. సులభంగా చేసుకునే,నోరూరించే అటుకులవడలను మీ కుటుంబంతో ఆస్వాదించండి.