బగార రైస్ లేదా బగారన్నం ఎక్కువగా తెలుగు ఇళ్లలో వంటకం. ప్రసిద్ధి చెందిన హైదరాబాదీ వంటకాలలో ఇది ప్రత్యేకమైనది.హైదరాబాద్ మరియు తెలంగాణ ప్రాంతాలలో వివాహాలు మరియు ఇతర విందు కార్యక్రమాలలో బగార రైస్ ప్రసిద్ధ వంటకం.
హైదరాబాదీ బగారా రైస్ వంటకం ఎవరైనా చాలా సులభంగా చేయవచ్చు. మొదటిసారి చేసినా కూడా ప్రొఫెషనల్ చెఫ్ తయారుచేసినట్టుగా ఉంటుంది. అదే ఈ బగార ప్రత్యేకత.
పండుగ రోజుల్లో, ప్రత్యేక రోజుల్లో లేదా వీకెండ్ లంచ్ కానీ డిన్నర్ కోసం ఇది మంచి వంటకం అని చెప్పవచ్చు. బగార మసాలా వంకాయ కూర, బంగాళాదుంప కూర, పన్నీర్ మసాలా లేదా పన్నీర్ మట్టర్ కుర్మాతో వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
అదే సమయంలో మటన్ మరియు చికెన్ కూరలతో కూడా అంతే రుచిగా ఉంటుంది.ఒక్కసారి తిన్నవారికి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ప్రత్యేక వంటకం. మరి ఎందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసి తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు:-
- బాస్మతి బియ్యం : అరకేజీ
- పచ్చిమిర్చి : 8
- క్యారెట్ : 5
- పుదీన : అరకప్పు
- కొత్తిమీర : అరకప్పు
- కరివేపాకు : 2 రెబ్బలు
- ఉల్లిపాయలు : 2
- బిర్యానీ ఆకులు : 6
- నూనె : 2 టేబుల్ స్పూన్లు
- నీళ్ళు : తగినన్ని
- నెయ్యి : 1 టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క : చిన్న ముక్క
- సాజిర : పావు టీ స్పూన్
- యాలకులు : 3
- లవంగాలు : 5
- రాతిపువ్వు : తగినంత
- మరాఠి మొగ్గ : 3
- అనాసపువ్వు : 3
- అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 టీస్పూన్
- ఉప్పు : తగినంత
తయారుచేయు విధానం:-
1
ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని , శుభ్రంగా కడిగి నీళ్ళుపోసి, అరగంట ముందు నానపెట్టుకోవాలి.
2
స్టవ్ పై మందపాటి వెడల్పు గిన్నె పెట్టి, చిన్న మంట పై ఉంచి, నెయ్యి , నూనె వేసి, వేడైన తరువాత సాజిరా ,లవంగాలు,యాలకులు,దాల్చిన,మరాఠీ మొగ్గ,అనాస పువ్వు,రాతిపువ్వు,బిర్యానీ ఆకు, వేసి వేయించుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు,క్యారెట్ ముక్కలు, వేసి కలుపుకుని, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
3
తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు కలుపుతూ ఉండాలి. పచ్చి వాసన పోయిన తరువాత ఒకటికి ఒకటిన్నర గ్లాస్ కొలతతో నీళ్ళుపోసి మరిగించుకోవాలి.
4
నీళ్ళు మరిగేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి, నానపెట్టుకున్న బియ్యం వేసి ఉడికించుకోవాలి.
5
అన్నం ఉడికిన తరువాత స్టవ్ ఆపేసి, పదినిముషాల తరువాత వేడి వేడిగా మటన్ లేదా చికెన్ కర్రీతో లేదా మసాలా వంకాయ, ఆలూకూర్మా తో వడ్డించుకుంటే, తిన్నవారెవరైనా ఆహా అనకుండా ఉండలేరు.
మీరు నచ్చే మరి కొన్ని వంటలు