తెలుగు వంటలలో అందులోనూ తీపి వంటకాలలో బెల్లం కి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. దీనిలో పిల్లల దగ్గర నుండి పెద్దలవరకు అవసరమైన ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్రక్తాన్నిశుద్ధి చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని కూడా పెంచుతుంది. రక్త హీనతను తగ్గిస్తుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది.
మరి అలాంటి అద్భుతలక్షణాలున్న బెల్లంతో ఈ రోజు పూరీలను చేసుకుందాం. ఈ బెల్లం పూరీలు ఎంతో రుచిగా ఉంటాయి. స్నాక్స్ లా పిల్లలకి పెట్టవచ్చు.
పిల్లలు సాధారణంగా పూరీలంటే ఇష్టంగా తింటారు. మరి వాళ్ళకి అంతగా నచ్చే పూరీలను తియ్యగా మరియు ఆరోగ్యకరంగా ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:-
- గోధుమ పిండి : ఒక కప్పు
- తరిగిన బెల్లం - అర కప్పు
- ఉప్పు : చిటికెడు
- నీరు : తగినంత
- నూనె : వేయించడానికి సరిపడా
తయారుచేయు విధానం:-
1
మందపాటి గిన్నెలో తరిగిన బెల్లం వేసి కొంచెం నీరు పోసి బెల్లం కరిగేంతవరకు వేడిచేయాలి.
2
బెల్లం కరిగేలోపు ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి తీసుకుని అందులో ఉప్పువేసి కలపాలి. తరువాత కరిగిన బెల్లం నీటిని పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
3
పదినిముషాల తరువాత చిన్న ఉండలుగా చేసుకుని ఒక్కో ఉండని పురీలా చేసుకోవాలి.మిగతా ఉండలని కూడా పూరీలు చేసుకోవాలి.
4
తరువాత కడాయి లో నూనె పోసి వేడయ్యాక చేసి పెట్టుకున్న పూరీలను వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించుకుంటే ఆరోగ్యకరమైన పూరీలు రెడీ.
ఈ బెల్లం పూరీలను ని పిల్లల చాలా ఇష్టంగా తింటారు.