గోంగూర రైస్ | గోంగూర అనే మాట వినగానే పుల్లని రుచి, అ వెంటనే నోట్లో నీళ్లూరుతాయి. ఈ రుచికి సాటి మారేది రాదు. ఆంధ్రమతగా తెలుగు వారు పిలుచుకునే గోంగూర ఒక్క రుచిలోనే కాదండి. ఆరోగ్యంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. గోంగూరతో కూరలు, ముఖ్యంగా పచ్చడి చేసుకుంటారు.
తెలుగువారి అభిమాన పచ్చడి అంటే గుర్తొచ్చేది గోంగూర పచ్చడే. పుల్ల పుల్లగా ఉండే గోంగూరతో పచ్చళ్ళే కాదు, అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. గోంగూర రైస్ ( పులిహోరా )చాలా రుచికరంగాను మరియు పుల్లగా, కొంచెం కారంగా ప్రత్యేకమైన రుచి కలిగి, పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికి నచ్చుతుంది. మరి ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:-
- అన్నం : రెండు కప్పులు
- గోంగూర: కప్పు
- ఆవాలు: అర టీస్పూన్
- తరిగిన కొత్తిమీర : 1 కప్పు
- పల్లీలు: పావు కప్పు
- శనగపప్పు: టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి: 4
- ఎండుమిర్చి: 4
- కరివేపాకు: 2 రెమ్మలు
- పసుపు: పావు టీస్పూన్
- ఉప్పు: తగినంత
- నూనె: తగినంత
తయారుచేయు విధానం:-
1
ముందుగా గోంగూరను సన్నగా తరిగి పెట్టుకోవాలి. అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. మెత్తగా కాకుండా చూసుకోవాలి.
2
కడాయి స్టవ్ పై పెట్టి, అందులో నూనె వేసి, వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, వేసి వేయించుకోవాలి. అవి చిటపటలాడిన తరువాత, శనగపప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి.
3
అవి వేగిన తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత పసుపు వేసి బాగా కలిపి, సన్నగా తరిగి పెట్టుకున్న గోంగూర ఆకుని వేసి, మీడియం మంటపై కలుపుతూ వేయించుకోవాలి.
4
గోంగూర ఉడికిన తరువాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత అన్నం వేసి, బాగా కలుపుకోవాలి. 5 నిముషాల తరువాత వడ్డించుకుంటే రుచికరమైన గోంగూర రైస్ రెడీ.