ఆవకాయ పచ్చడి ( మామిడికాయ పచ్చడి ) పేరుని వినని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పేరు వినగానే నోరూరుతుంది ఎవరికైనా, తెలుగువారికి ఆవకాయతో విడదీయలేని బంధం ఉంది. ఎంతగా అంటే వారి జీవనవిధానంలో భాగం అయింది.
పప్పుతో, పెరుగు తో, పప్పుచారుతో, ముద్దపప్పు చేస్తే ఆవకాయ ఉండాల్సిందే. వేడి వేడి అన్నంలో నెయ్యి తో ఆవకాయ తినని వారు కూడా ఉండరేమో,
రోజు చేసుకునే వంటలపైనా ఒక్కోసారి విరక్తి వస్తుందేమో కానీ, అదే ఆవకాయ రోజు తిన్నా కూడా బోర్ అనిపించదు.
కొన్నిసార్లు వంట చేయాలంటే బద్దకంగా ఉంటుంది. అలాంటప్పుడు కనిపించే అద్భుతమైన వంటకం మామిడికాయ పచ్చడే.
మామిడికాయ పచ్చడిని వివిధ ప్రాంతాలలో వేరు వేరు పద్దతుల్లో చేస్తారు. రకరకాల పేర్లతో పిలుస్తారు. ఏది ఏమైనా మన ఆవకాయ కున్న ప్రత్యేకతే వేరు. ఈ పచ్చడి ఎక్కడ ఎలా మొదలుపెట్టారో కానీ మనకు మాత్రం ప్రీతికరమైనదిగా మారిపోయింది.
ఈ పచ్చడి తయారీలో వాడే ప్రతి పదార్ధం ముఖ్యమైనదనే చెప్పాలి, ఎందుకంటే ఏ ఒక్కటి వేయకపోయిన ఆవకాయ రుచి మారిపోతుంది. సమ్మర్ అనగానే సెలవులే గుర్తొస్తాయి. సెలవులతో పాటు మామిడికాయ సీజన్ కూడా వస్తుంది.
ఏ పచ్చడి అయినా ఒక్కరు చేస్తే అయిపోతుంది. కానీ ఈ పచ్చడిలో ఇంట్లో ఉన్న వారంతా ఏదో ఒక విధంగా పాల్గొంటారు. అందులోనూ ఒకటి రెండు రోజులకు సరిపోయేది కాదు కదా . సంవత్సరం అంతా నిలువ ఉండే పచ్చడి అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మా చిన్నప్పుడు ఇంటిల్లిపాది కలిసి చేసేవారు. 30 – 50 కాయల వరకు పెట్టేవారు. ముందురోజే తీసుకొచ్చేవారు అవి తేగానే ఎన్నున్నాయో లెక్కించేవారిమి.
రాత్రంతా ఉప్పునీటిలో నానపెట్టి, ఉదయాన్నే వాటిని కడిగేవారు ఒకరు, ఒక్కొక్క మామిడికాయను తుడిచి అరపెట్టడం ఇంకొకరు, వాటిని కట్ చేసేవారిని ప్రత్యేకంగా పిలిపించేవారు. వారు వచ్చేలోపు యుద్ద ప్రాతిపదికన అన్నీ పొడులు దంచి, సిద్దం చేసుకునే వారు.
పిల్లలం అంతా చాలా ఆసక్తిగా అన్నిటినీ గమనిస్తూ , అక్కడే ఉండేవాళ్లం. ఆరోజు చాలా వింతగా అనిపించేది పెద్దవాళ్లంతా అన్నీ పనులు పక్కన పెట్టి పచ్చడి చేయడంలో నిమగ్నం అయ్యేవారు. దాదాపు మూడు నాలుగు గంటలు పట్టేది. ఆ రోజు మా బామ్మ హడావుడి మామూలుగా ఉండేది కాదు.
పిల్లలం అంతా పచ్చడి ఎప్పుడు కలుపుతారా అని ఎదురుచూసేవాళ్ళం, ఎందుకంటే పచ్చడి కలిపి జాడీలో వేసిన తరువాత, ఆ పచ్చడి కలిపిన పాత్రలో వేడి వేడి అన్నం కలిపి పిల్లలందరికి పెట్టేది మా అమ్మ,
పచ్చడి రుచి ఒక ఎత్తు అయితే చివర్లో కలిపి ఇచ్చే అన్నం రుచి మరొక ఎత్తు , ఆ రుచికి ఎవరైనా ఫిదా అవాల్సిందే.
అందులో మా అమ్మ పెట్టిన ఆవకాయ ప్రత్యేకమైనది. చాలా రుచిగా ఉంటుంది. వీధి అంతా ఆ వాసనతో నిండిపోయేది.
పచ్చడి పెట్టడానికి కావాల్సిన జాగ్రత్తలు వంటకం చివర్లో ఉన్నాయి. అవి పాటించి చేసుకుంటే సంవత్సరంతా పచ్చడిని ఆస్వాదించవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం మన అందరకి ప్రత్యేకమైన మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం పదండి.
కావలసిన పదార్థాలు:-
- మామిడికాయలు : 4
- కారం : ఒక కప్పు
- ఉప్పు : ఒక కప్పు
- ఆవ పిండి : ఒక కప్పు
- జీలకర్రమెంతుల పొడి : ఒకటిన్నర స్పూన్లు
- వెల్లుల్లి : పావు కప్పు
- నూనె : ఒకటిన్నర కప్పులు
తయారుచేయు విధానం:-
1
ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి. తడి ఉంటే పచ్చడి బూజు పడుతుంది. తడిలేకుండా చూసుకుని మామిడికాయాలను మనకు నచ్చిన పరిమాణంలో (సైజ్ లో ) ముక్కలుగా కట్ చేసుకోవాలి
2
ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో కట్ చేసుకున్న ముక్కలను తీసుకుని, వాటిపైన ఆవపిండిని, జీలకర్రమెంతుల పొడిని, కారం, ఊపు వేసి, పొట్టుతీసుకున్న వెల్లుల్లిపాయాలను వేసి, బాగా కలుపుకోవాలి.
ప్రతి ముక్కకి పొడులన్నీ పట్టుకునేంతగా బాగా కలుపుకోవాలి.
3
తరువాత నూనె పోసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పచ్చి నూనెను కలిపాను.
కావాలనుకున్న వారు, నూనె వేడి చేసి అందులో ఆవాలు, మెంతులు, పోపు గింజలు వేసి వేయించి, నూనె చల్లబడిన తరువాత కలుపుకోవచ్చు.
4
ముక్కలను బాగా కలిపిన తరువాత, మూతపెట్టి రెండు రోజులు ఊరనివ్వాలి. మద్యలో ఒకటి రెండుసార్లు కలుపుతూ ఉండాలి.
రెండురోజుల తరువాత కలిపి, నూనె, ఉప్పు అవసరమైతే కలుపుకోవాలి. ఉప్పు తక్కువైతే బూజు పడుతుంది.
5
తరువాత తడి లేకుండా చూసుకుని జాడిలోకి లేదా గాజు బాటిల్లోకి కానీ మార్చుకోవాలి.నోరూరించే ఈ మామిడికాయపచ్చడిని, తయారుచేసి మీ ఇంట్లోవారికి రుచి చూపించండి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:-
మామిడికాయలు గట్టిగా ఉండేట్టుగా మరియు రుచి చూసి పుల్లగా ఉండేవాటిని ఎంచుకోవాలి.
పచ్చడిలో వాడే కారం ఎర్రగా ఉంటే రుచి మరియు చూడడానికి కూడా బాగుంటుంది. కుదిరితే ఎండుమిర్చి కొని, బాగా ఎండపెట్టుకుని పట్టిచ్చుకున్న కారం అయితే పచ్చడి చాలా బాగుంటుంది.
ఉప్పు సరిపడినంతగా వేయాలి. తక్కువైతే పచ్చడి బూజు పడుతుంది. అలాగే నూనె కూడా తగినంత పోయాలి. ముక్కలు మునిగేట్టుగా చూసుకోవాలి. లేకపోతే పచ్చడి రంగు మారుతుంది.
పచ్చడిలో ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే, టేస్ట్ చూసి, రుచికి తగినట్లుగా వేసుకోవచ్చు.