మల్టిగ్రైన్ బిస్కెట్స్
పిల్లలను మీకు ఇస్టమైన చిరుతిండి ఏంటి అని అడిగితే వెంటనే వినిపించే పేరు బిస్కెట్స్ అనే చెప్తారు,ఎక్కువ శాతం పిల్లలు నో చెప్పకుండా తినే స్నాక్స్ కూడా బిస్కెట్సే.
స్కూల్ స్నాక్స్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే 90% అవే కనిపిస్తాయి. ఎందుకంటే పాకెట్ తీసి బాక్స్ లో పెడితే మనకు తేలిక, వాళ్ళు తినను అని మారాం చేయరు.
మరి పిల్లలు ఇంతగా ఇష్టపడే వాటిని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక పదిహేను నిముషాలు కేటాయించగలిగితే శుభ్రంగా, ఆరోగ్యకరమైన పదార్ధాలతో తేలికగా చేసుకోవచ్చు.
మల్టీగ్రైన్ గోధుమపిండి ఆరోగ్యానికి మంచిదే, అలాగే బెల్లం లో పిల్లలకి కావాల్సిన ఐరన్ ఉంటుంది.ఈ రోజుల్లో ఎక్కువమందిలో రక్తహీనత ఉంటుంది. కానీ అది మనం గుర్తించలేకపోతున్నాం.
కాబట్టి పిల్లలకి ఇంట్లోనే వారికి ఇస్టమైన బిస్కెట్స్ ని చేసిపెడితే వారు ఆరోగ్యంగా ఉంటారు. మనకు అవి ఎలా చేశారో అన్న టెన్షన్ ఉండదు.
ఈ మల్టిగ్రైన్ బిస్కట్స్ చాలా రుచికరంగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దాం పదండి.
కావలసిన పదార్థాలు:-
- మల్టిగ్రైన్ గోధుమ పిండి : రెండు కప్పులు
- తరిగిన బెల్లం - ఒక కప్పు
- ఉప్పు : చిటికెడు
- నీరు : తగినంత
- యాలకుల పొడి : పావుస్పూన్
- నూనె : వేయించడానికి సరిపడా
తయారుచేయు విధానం:-
1
ఒక గిన్నెలో తరిగిన బెల్లం వేసి కొంచెం నీరు పోసి బెల్లం కరిగేంతవరకు వేడిచేయాలి.
2
ఒక వెడల్పాటి పాత్రలో పిండి తీసుకుని అందులో ఉప్పువేసి కలపాలి. తరువాత కరిగిన బెల్లం నీటిని పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
3
పదినిముషాల తరువాత చిన్న ఉండలుగా చేసుకుని ఒక్కో ఉండని చపాతీలా చేసుకుని, చాక్ తో అడ్డంగా నిలువుగా, డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి.
4
కడాయి లో నూనె పోసి వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న వాటిని వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించుకుంటే ఆరోగ్యకరమైన బిస్కెట్లు రెడీ.
5
ఇవి వారం రోజులవరకు నిలువ ఉంటాయి.ఈ బిస్కెట్లని పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరు ఇష్టంగా తింటారు.