సర్వపిండి
సర్వపిండి | తెలంగాణ సాంప్రదాయక వంటకం సర్వపిండి. దీనిని సర్వప్ప, గిన్నెప్ప, గిన్నెపిండి, తపాలా చెక్క, గంజుపిండి.. ఇలా వివిధ పేర్లతో మరియు వివిధ రకాలుగా చేసుకునే చిరుతిండి వంటకం.
చాలా రుచికరంగా ఉండే ఈ తెలంగాణ ప్రత్యేక వంటకం చేయడం చాలా తేలిక, మరియు తక్కువ సమయంలో చేయగలిగే వంటకం అని చెప్పవచ్చు. సామాన్యుడి పిజ్జాగా పిలిచే ఈ వంటకంను ఉదయం, సాయంత్రం టిఫిన్ గా కూడా తింటారు.
సర్వపిండికి వరంగల్ జిల్లాలోని బొల్లేపల్లి గ్రామం ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో మొదటిసారిగా తయారుచేసినట్టుగా చెబుతారు. దీనిని బియ్యపుపిండి, కరివేపాకు, పల్లీలు, నువ్వులు ప్రధానంగా వాడుతారు. మిగతా దీనుసులను ఎవరి అభిరుచి తగినట్టుగా వారు వాడుతారు.
ఇది చూడడానికి రొట్టె మాదిరిగా ఉండే ఈ పిండిని గిన్నెకి పలుచగా ఒత్తి, మద్యలో అక్కడక్కడా రంధ్రాలు పెట్టి కాలుస్తారు. దీనిని తిరగేయాల్సిన అవసరం లేదు.
అడుగు మందంగా ఉన్న గిన్నెలో చేసుకుంటే సరిగ్గా ఉడికి చాలా రుచిగా వస్తుంది. ఉల్లి ఆకు వేస్తే మరింత రుచిగా ఉంటుంది. మరి ఇంత రుచిగల సర్వపిండిని ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:-
- బియ్యప్పిండి : 2 కప్పులు
- పచ్చి మిర్చి : 2
- వెల్లుల్లిపాయలు : 8
- జీలకర్ర : టేబుల్ స్పూన్
- కారం : పావు టీ స్పూను
- పల్లీలు : 2 టేబుల్ స్పూన్లు
- నువ్వులు : రెండు టేబుల్ స్పూన్లు
- నీళ్ళు : తగినన్ని
- సెనగ పప్పు : 2 టేబుల్ స్పూన్లు
- తరిగిన కొత్తిమీర : టేబుల్ స్పూన్
- కరివేపాకు – రెండు రెమ్మలు
- ఉల్లిపాయ : 1
- ఉల్లి ఆకు తరుగు ( స్ప్రింగ్ అనియన్ ) : టేబుల్ స్పూన్
- ఉప్పు – తగినంత
- నూనె : తగినంత
తయారుచేయు విధానం:-
1
ముందుగా సెనగపప్పుని రెండుగంటలపాటు నానపెట్టుకోవాలి. పల్లిలను కొద్దిగా వేయించుకోవాలి, అంటే దోరగా అవగానే తీసి చల్లార్చుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2
ఒక వెడల్పాటి గిన్నెలో బియ్యపు పిండి తీసుకుని, దానిలో పల్లీలు, నానపెట్టిన శెనగ పప్పు, నువ్వులు, గ్రైండ్ చేసిపెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమం, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, ఉల్లి ఆకు తరుగు, పొడవుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కొద్ది కొద్దిగా నీరు కలుపుతూ పిండిని గట్టిగా కలుపుకోవాలి.
3
అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని, అందులో కొంచెం నూనె వేసి, అడుగు అంతా పట్టేలా చేతితో సరిచేయాలి.
4
కలిపిపెట్టుకున్న పిండి కొంచెం (జామకాయ పరిమాణంలో) తీసుకుని, గిన్నె అడుగుభాగంలో ఉంచి పిండిని పలుచగా ఒత్తుకుని, అక్కడక్కడా రంధ్రాలు చేసి, కొద్దిగా నూనె వేసి, మూతపెట్టి, స్టౌ పై పెట్టి బాగా కాల్చుకోవాలి.
5
మాడిపోకుండా మధ్య మధ్యలో గిన్నెను తిప్పుతూ ఉండాలి.గిన్నెనుండి వీడి పోయిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని వడ్డించుకోవాలి.