ఆహార

ఉగాది

శ్రావ్యమైన కోయిల గానాలతో స్వాగతం చెప్పే నూతన సంవత్సరాది రోజున మామిడి తోరణాలతో కళకళలాడే గుమ్మాలు ఇంటికి సంప్రదాయ కళను తెస్తుంది. షడ్రులచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి జీవిత తత్వాన్ని చెప్పకనే చెబుతుంది. అంతే కాదు ఆరోగ్యప్రదాయిని కూడా. వసంత ఋతువు సమయంలో జరిగే మార్పుల వల్ల వ్యక్తిగత జీవితం ప్రభావితం అవుతుంది. దానివల్ల అనారోగ్యానికి గురి కాకుండా  ఉండేందుకు ఈ సమయంలో దొరికే  ఔషధాలను కలిపి ఉగాది పచ్చడిని ఎలా తయారుచేసుకోవాలో శాస్త్రాలు చెప్తున్నాయి. 

ఉగాది పచ్చడి తయారుచేయడానికి వాడే మామిడి, బెల్లం, వేపపువ్వు ,చింతపండు,ఉప్పు,కారం, ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేక రుచిని కలిగి, శరీరంలోని వాత ,పిత్త ,కఫదోషాలను నిరోధించడమే కాకుండా కొత్త సంవత్సరంలో ఎదురయ్యే తిపి, చేదు లాంటి అనుభవాలను స్వీకరించడానికి మొదటి రోజు నుండి సిద్దంగా ఉండాలని ఉగాది పచ్చడి చెబుతుంది.

కొత్త సంవత్సరం మొదటి రోజైన ఉగాది ఆనందంగా, శుభప్రదంగా జరుపుకుంటే మిగిలిన సంవత్సరమంతా బాగుంటుందని అంటారు.ఈ ఏడాది శార్వరి నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. తెలుగు సంవత్సరాలలో ఇది ముప్పై నాలుగవ సంవత్సరం. ఉగాది రోజున ప్రత్యేకమైన పూజలు ఏమి చేయకపోయిన, తెలవారుజామునే లేచి అభ్యంగ స్నానం చేసి ,కొత్త బట్టలు కట్టుకుని ఇష్టదేవత పూజ చేసి,నైవేద్యంగా ఉగాదిపచ్చడి , భక్ష్యాలు( బొబ్బట్లు) పెడుతారు.

బొబ్బట్లు

ఉగాది రోజున కొత్తగా ఏ పనులు మొదలుపెట్టినా, మిగిలిన సంవత్సరమంతా సవ్యంగా ఉంటుందని నమ్ముతారు. ఉగాది రోజున చేసేవాటిలో పంచాంగ శ్రవణం తెలుగువారికి ప్రత్యేకమైనది.

ఉగాది పచ్చడి ప్రత్యేకత :-​

బెల్లం :-  ఉగాది పచ్చడిలో బెల్లం తీపికి గుర్తు.జీవితంలో అన్నీ సమయాల్లో సంతోషంగా ఉంటే అనుకోకుండా చిన్న బాధ వచ్చినపుడు తట్టుకునే శక్తి ఉండదు. తీపి కూడా కొంచెమే తీసుకోవాలని ఉగాది పచ్చడి చెబుతుంది. దీనిలో రక్తాన్ని శుద్ది చేసే పోషకాలు ఉంటాయి. మలబద్ధకం, దగ్గు, రక్తహీనత, అజీర్తి ని తగ్గిస్తుంది.

వేపపువ్వు:- వేప అంటేనే చేదు గుర్తుకువస్తుంది. జీవితంలో ఎదురయ్యే బాధ కలిగించే సంగతులను సూచిస్తుంది. వేపపువ్వులోని చేదు కడుపులోని పురుగులను / క్రిములను చంపుతుంది. చర్మ సమస్యలను నిరోధిస్తుంది.

చింతపండు :- చింతపండులోని పులుపు వేడిని తగ్గిస్తుంది. వాత ,పిత్త, రోగాలని తగ్గిస్తుంది. జ్వరాన్ని నివారిస్తుంది.పులుపు నేర్పుకి సంకేతంగా చెబుతారు. జీవితంలో ఏదైనా చేయాలంటే నేర్పు అనేది ముఖ్యం.

మామిడి:-  ఉగాది పచ్చడిలో మామిడి వగరు రుచినిస్తుంది. దేనికైనా సిద్దంగా ఉండాలని సూచిస్తుంది. ఇది శరీరంలోని మలినాలను నివారిస్తుంది. వడదెబ్బను నివారిస్తుంది.

కారం:- ఉగాది పచ్చడిలో కొందరు ఎండు మిర్చీని లేదా మిరియాల పొడిని లేదా కారాన్ని వాడుతారు.కారం అంటే మంటను కలిగించేది. మన జీవితాల్లో ఎదురయ్యే సంఘటనలను తట్టుకోగల శక్తిని పొందుకోగలగాలి.

ఉప్పు:-  ఉప్పు లేకుండా రుచి అనేది రాదు వంటకానికి. ఇది సరైన మోతాదులో ఉంటేనే రుచి, ఆరోగ్యం. ఉప్పును ఉత్సాహానికి గుర్తుగా చెప్తారు పెద్దలు. అంటే జీవితంలో కూడా సరైన మోతాదులో ఉండాలని అర్దం. అందుకేనేమో మాటలు ఉప్పు వేసినట్టు రుచిగా ఉండలంటారు.

Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!