Home / పచ్చళ్లు/ 😋తెలంగాణ స్టైల్ మటన్ పచ్చడి…

😋తెలంగాణ స్టైల్ మటన్ పచ్చడి…

June 30, 2026 1:49 pm
|
By

మటన్‌తో రకరకాల వంటలు తయారుచేస్తుంటాం కానీ, మటన్ పచ్చడి ప్రత్యేకం అని చెప్పొచ్చు. తెలుగు పల్లెల్లో పండగ ఏదైనా వచ్చినా, చుట్టాలు ఇంటికి వచ్చినపుడు ఈ పచ్చడిని ఎక్కువగా చేస్తుంటారు. మటన్ పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఉండే రుచిని మాటల్లో వర్ణించలేము.

అయితే మటన్ పచ్చడి అనేది ప్రత్యేకంగా ఒక వ్యక్తి కనిపెట్టిన రెసిపి కాదు. పాతకాలంలో (ఫ్రిజ్‌లు లేని) కాలంలో మాంసాన్ని ఒక్క రోజులో తినడం పూర్తిగా సాధ్యమయ్యేది కాదు. అందువల్ల మిగిలిన మాంసం పాడవకుండా ఉండడం కోసం, అప్పటి ప్రజలు ఎక్కువ రోజులు నిల్వ చేయడం కోసం అనుసరించిన సంప్రదాయ విధానాల నుండి ఈ పచ్చడి అభివృద్ధి చెందింది. కాలక్రమంలో ప్రత్యేక మసాలాలు, కారం, వెల్లుల్లి, నూనెతో తయారు చేసే మటన్ పచ్చడి ప్రత్యేకమైన రుచితో, నేటికీ పల్లె వంటకాలలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. ఈ పచ్చడి వేడి అన్నంలోనే , కాకుండా చపాతీ, రాగి సంగటి, జొన్న రొట్టె వంటి వాటితో కూడా చాలా రుచిగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, తమిళనాడు, కర్ణాటక లాంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో సైతం ప్రాంతాలవారి ప్రత్యేకమైన రుచితో ఈ మటన్ పచ్చడి ప్రఖ్యాతి చెందింది. ఇంట్లోనే హోటల్ స్టైల్ లో కాకుండా, తెలుగింటి రుచితో మటన్ పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం.

🛒 కావలసిన పదార్థాలు:-

  • మటన్ – 250 గ్రాములు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  • పసుపు – కొద్దిగా
  • నీరు – తగినంత
  • ఎండు మిరపకాయలు – 8
  • ధనియాల పొడి  – 1 టీ స్పూన్
  • వెల్లుల్లి – 20 రెబ్బలు
  • జీలకర్ర – 1 టీ స్పూన్
  • ఉప్పు – తగినంత
  • కారం –  1 టేబుల్ స్పూన్
  • మిరియాల పొడి  – ½ టీ స్పూన్
  • నూనె – తగినంత
  • కరివేపాకు –  రెమ్మ
  • ఆవాలు – 1/2 టీ స్పూన్
  • గరం మసాల – 1 టీ స్పూన్
  • నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్

    👩‍🍳 తయారీ విధానం:-

    స్టెప్ 1: – ముందుగా మటన్‌ను బాగా శుభ్రంగా చేసుకుని కుక్కర్‌లో వేసి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, అవసరమయిన నీరు వేసి మటన్ మెత్తగా అయ్యే దాకా ఉడికించాలి.
    స్టెప్ 2: – ఇప్పుడు మెత్తగా ఉడిన మటన్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి( ఉడించడానికి ముందు అయిన చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు). 
    స్టెప్ 3 : – పాన్ లో డీప్ ఫ్రై కోసం నూనె వేడి చేయాలి. అందులో ఉడించిన మటన్ ముక్కలను వేసి వేయించుకోవాలి. వేగిన తరువాత ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి.
    స్టెప్ 4: –
    అదే నూనెలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని మటన్ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టాలి.
    స్టెప్ 5: – చల్లారిన తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాల, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.  తరువాత నిమ్మరసం వేసి కలుపుకుని మూతపెట్టి, ఒకరోజంతా పక్కన పెట్టాలి. దానివల్ల ముక్కలు ఊరుతుంది. అంతే టేస్టీ మటన్ పచ్చడి రెడీ..

    తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):-

    1. మటన్ పచ్చడి ఎన్ని రోజుల దాకా నిల్వ ఉంటుంది?

    తాజా మటన్ ఉపయోగించి తయారు చేసి, చల్లారిన తర్వాత తడిలేని గాలి చొరబడని(ఎయిర్ టైట్ ) గాజు సీసాలో నిలువ చేస్తే 7–10 రోజుల దాకా ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టినట్లయితే ఇంకొన్ని రోజులు నిలువ ఉంటుంది.

    2. ఈ పచ్చడికి ఏ మాంసం బాగా సరిపోతుంది?

    తాజా మేక మాంసం (గోట్ మటన్) వాడితే పచ్చడికి మంచి రుచి మరియు టెక్స్చర్ వస్తుంది.

    3. ఈ పచ్చడిని ఏ విధంగా తింటే బాగుంటుంది?

    వేడి వేడి అన్నంలో నెయ్యితో, లేదా రాగి సంగటి, జొన్న రొట్టె,  సజ్జ రొట్టె మరియు చపాతీ తింటే మరింత రుచిగా ఉంటుంది.

    4. మటన్ పచ్చడికి ఎలాంటి నూనె ఉపయోగించడం మంచిది?

    నువ్వుల నూనె లేదా పల్లి నూనె ఉపయోగిస్తే పచ్చడి రుచి బాగుంటుంది. నిలువ ఉండే కాలం మెరుగుపడుతుంది.

    5. మటన్ పచ్చడి తయారుచేసేటపుడు చింతపండు తప్పనిసరిగా ఉపయోగించాలా?

    తప్పనిసరి కాదు. అయితే కొన్ని ప్రాంతాల్లో మటన్ పచ్చడిలో చింతపండును వేస్తారు, కొన్ని ప్రాంతాల్లో కారం, వెల్లుల్లి, మసాలాలతో తయారు చేస్తారు.

    6. మటన్ పచ్చడిలో కారం ఎక్కువైన సందర్భంలో ఏం చేయాలి?

    కారం ఎక్కువైనపుడు అందులో కొంచెం ఉడికించిన మటన్ ముక్కలను కలిపితే కొంత వరకు సమతుల్యం అవుతుంది.

    7. ప్రతిరోజూ మటన్ పచ్చడిని తినవచ్చా?

    ఈ పచ్చడి నూనె, మసాలాలు, ఉప్పు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అందువల్ల పరిమిత మోతాదులో, రోజు కాకుండా అప్పుడప్పుడు తీసుకోవడం మంచిది.

    మేక కాళ్ల పాయ – ఇంట్లోనే హోటల్ స్టైల్ రుచి